ఎల్‌నినో ప్రభావంపై పంటల పరిశీలన
ఎల్‌నినో ప్రభావంపై పంటల పరిశీలన చాట్రాయిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ బృందం క్షేత్రస్థాయి పర్యటన
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం కారణంగా పంటలపై పడుతున్న ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. తక్కువ వర్షపాతం నమోదైన మండలాల్లో పంటల పరిస్థితి, దిగుబడుల అంచనాలు, సాగునీటి లభ్యత తదితర అంశాలను పరిశీలించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఏలూరు జిల్లాలో చింతలపూడి, లింగపాలెం, చాట్రాయి మండలాలను బృందం పరిశీలించింది.
అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వి.వి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఆర్. రామ్మోహన్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎస్.కె. హబీబ్ భాషా, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ కే. సాజ నాయక్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీఎంఐపీ ఎస్. రామ్మోహన్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బి. రామమోహన్ తదితరులు బృందంలో పాల్గొన్నారు.
చాట్రాయి మండలంలోని పర్వతాపురం, పోలవరం గ్రామాల్లో బృందం పర్యటించి డ్రిప్ సాగులో ఉన్న ఆయిల్‌పామ్ తోటలు, వరి పంటలను పరిశీలించింది. తక్కువ వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం వల్ల పంటల ఎదుగుదల, దిగుబడులపై ఎలాంటి ప్రభావం ఏర్పడిందో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగునీటి లభ్యత, పంటల ప్రస్తుత పరిస్థితి, దిగుబడి అంచనాలు, పంటల నిర్వహణ విధానాలపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం పోలవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. పంటల దిగుబడులు, విత్తనాల లభ్యత, వ్యవసాయానికి అవసరమైన ఇతర సదుపాయాలపై రైతుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పంటలకు అవసరమైన సూక్ష్మ పోషకాలను అందించాలని రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నమోదు చేసుకున్న అధికారులు వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో పోలవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు ఎర్రా ప్రసాద్‌తో పాటు పలువురు రైతులు, చాట్రాయి మండల వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ వివరాలను చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు.