పెనుగొలనులో 25 మంది కబడ్డీ క్రీడాకారులకు దుస్తుల పంపిణీ
క్రీడాకారులను ప్రోత్సహించడం మనందరి బాధ్యత: విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో శుక్రవారం రాత్రి దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో 25 మంది క్రీడాకారులకు దుస్తులు అందజేశారు.
ఇటీవల అమరావతిలో నిర్వహించిన ఛాంపియన్‌షిప్ స్టేట్ మీట్‌లో అండర్–23, అండర్–17 విభాగాల్లో పెనుగొలను గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. వారి ప్రతిభను గుర్తించి విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి ఆర్థిక సహకారంతో దుస్తులు పంపిణీ చేశారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన గ్రామానికి చెందిన ఇతర విద్యార్థులకు కూడా దుస్తులు అందజేశారు.
కార్యక్రమానికి ముందు జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామానికి మంచి పేరు తీసుకొస్తున్న క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సామాజిక ప్రయోజనం కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడాకారులకు దుస్తుల పంపిణీకి ఆర్థికంగా సహకరించిన వెదురు వెంకటరెడ్డితో పాటు కార్యక్రమ నిర్వహణకు తోడ్పడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇనపనూరి శంకరరావు, ఇనపనూరి పిచ్చయ్య, గ్రామస్తులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.