భయపడొద్దు.. పార్టీ అండగా ఉంటుంది: దేవినేని అవినాష్
విజయవాడలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ను తిరువూరుకు చెందిన మున్సిపల్ విభాగం జిల్లా కార్యదర్శి మోదుగు ప్రసాద్ కలిశారు. ఇటీవల డీఎస్సీ అక్రమాలపై విజయవాడలో వైఎస్సార్సీపీ నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న సందర్భంగా పోలీసులు తనపై వ్యవహరించిన తీరును మోదుగు ప్రసాద్ అవినాష్కు వివరించారు.
ఆందోళన సమయంలో చోటుచేసుకున్న ఘటనలు, అనంతరం తనపై నమోదైన చర్యలు, అరెస్టు నుంచి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసే వరకు జరిగిన పరిణామాలను ఆయన వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా జిల్లా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు.
మోదుగు ప్రసాద్ వివరించిన అంశాలపై దేవినేని అవినాష్ ఆరా తీశారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి నాయకుడు, కార్యకర్తకు వైఎస్ జగన్ అండగా ఉంటారని తెలిపారు. జిల్లాలో పార్టీ శ్రేణులకు తాను అండగా ఉంటానని, ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి శిరసాని ప్రకాష్, కే. నరేష్, బి.వి.ఆర్ తదితరులు పాల్గొన్నారు.