ఎల్‌ఐజీ క్వార్టర్స్‌లో తాగునీటి కాలుష్యాన్ని అరికట్టాలి
అచ్చయ్య నగర్ బస్తీలోని గ్యాస్ గోడౌన్‌ను తరలించాలి.. సీపీఎం డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ముషీరాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో అచ్చయ్య నగర్, బాగ్ లింగంపల్లి ఎల్‌ఐజీ క్వార్టర్స్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శివర్గ సభ్యుడు ఎం. దశరథ్ స్థానిక సమస్యలను ప్రస్తావించారు.
మంచినీటిలో డ్రైనేజీ నీరు కలుస్తోందని ఆరోపణ
బాగ్ లింగంపల్లి డివిజన్ పరిధిలోని ఎల్‌ఐజీ క్వార్టర్స్‌లో కొన్ని నెలలుగా మంచినీటిలో డ్రైనేజీ నీరు కలిసి దుర్వాసనతో సరఫరా అవుతోందని ఎం. దశరథ్ ఆరోపించారు. ఈ సమస్యను కాలనీవాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ప్రజలకు సరఫరా చేస్తున్న నీటిని వాటర్ వర్క్స్ అధికారులు కూడా వినియోగిస్తారా అని ప్రశ్నించారు. వెంటనే నీటి కాలుష్య సమస్యను పరిష్కరించి, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాలనీలో కొన్ని డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు కుంగిపోయాయని, వాటిని వెంటనే మార్చాలని కోరారు.
అచ్చయ్య నగర్ నుంచి గ్యాస్ గోడౌన్‌ను తరలించాలి
ముషీరాబాద్ జోన్ కార్యదర్శి ఆర్. వెంకటేష్ మాట్లాడుతూ అచ్చయ్య నగర్ బస్తీలో ఉన్న గ్యాస్ గోడౌన్‌ను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. బస్తీలో సివిల్ సప్లై గోడౌన్ ఉండటంతో ఇళ్లలోకి లక్కపురుగులు, ఎలుకలు వస్తున్నాయని, దీనివల్ల స్థానికులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
బస్తీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గోడౌన్‌ను మరో ప్రాంతానికి తరలించాలని అధికారులను కోరారు.
పాదయాత్రలో పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో సీపీఎం జోన్ కార్యదర్శివర్గ సభ్యుడు కె. రమేష్, జోన్ కమిటీ సభ్యురాలు ఆర్. వెంకటమ్మ, నాయకులు వీరయ్య, మల్లయ్య, నాగేశ్వరరావు, వెంకటేష్, శంకరయ్య, శ్రీను, నగేష్ తదితరులు పాల్గొన్నారు.