వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఫామ్ పాండ్లు ఎంతో ఉపయోగకరం
NTODAY NEWS : చిట్యాల
ఎల్-నినో ప్రభావం దృష్ట్యా రైతులు వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టుకోవాలని చిన్నకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ సూచించారు. మంగళవారం గ్రామంలో చేపడుతున్న ఫామ్ పాండ్ పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి రైతు తన వ్యవసాయ బావి సమీపంలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తద్వారా వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించడంతో పాటు, ఫామ్ పాండ్‌లో నిల్వ చేసిన నీటిని కూరగాయల సాగుకు, చేపల పెంపకానికి వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఫామ్ పాండ్ నిర్మించుకున్న రైతుకు మహిళా సంఘంలో సభ్యత్వం ఉంటే బర్రెల షెడ్డు నిర్మాణంతో పాటు రెండు గేదెలను అందించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, మహిళా సంఘాల్లో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఏ వినోద్, 7వ వార్డు సభ్యుడు దేశపాక మధు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.