ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు
శాలిగౌరారం: టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శాలిగౌరారం మండలానికి గుర్తింపు లభించింది. మండలంలోని తక్కలపాడు, జాలూన్‌గూడెం, రామగిరి, బైరంబండ, తుడిమిడి గ్రామపంచాయతీలు ‘టీబీ ముక్త్ పంచాయతీలు’గా గుర్తింపు పొందాయి.
గ్రామస్థాయిలో టీబీ నిర్మూలనకు చేపట్టిన చర్యలు, ప్రజల్లో వ్యాధిపై అవగాహన కల్పించడం, అనుమానితులను గుర్తించి పరీక్షలకు ప్రోత్సహించడం, వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్స అందేలా సహకరించడం వంటి కార్యక్రమాల ఆధారంగా ఈ గుర్తింపు లభించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తక్కలపాడు గ్రామ సర్పంచ్ కట్టంగూరు సురేందర్ రెడ్డి గ్రామస్థాయిలో టీబీ నిర్మూలనకు చేసిన కృషికి గుర్తింపుగా కలెక్టర్ చేతుల మీదుగా ‘టీబీ ముక్త్ పంచాయతీ’ అవార్డును అందుకున్నారు.
టీబీ నిర్మూలన కోసం కృషి చేసిన ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలను పలువురు అభినందించారు. గ్రామస్థాయిలో సమష్టి కృషితో టీబీని నియంత్రించేందుకు చేపట్టిన కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
టీబీ రహిత గ్రామాల నిర్మాణం దిశగా శాలిగౌరారం మండలంలోని ఐదు గ్రామపంచాయతీలు గుర్తింపు పొందడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ టీబీ నిర్మూలన కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కోరుతున్నారు.