రూ.1.97 కోట్లతో తారురోడ్డు పనులకు శంకుస్థాపన
రూ.13.5 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం
స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తాం: ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
కందుకూరు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను గెలుచుకుంటామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు.
గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం నుంచి రాజుగారి చింతలపాలెం వరకు పల్లె పండుగ-3.0 కార్యక్రమం కింద రూ.1.97 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న తారురోడ్డు పనులకు మంగళవారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.13.5 లక్షలతో కొత్తగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మండల టీడీపీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గుర్రంపై ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకువెళ్లారు. సన్నాయి, బ్యాండ్ మేళాల మధ్య గజమాలతో సత్కరించారు.
అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ పెద్దలు, అధికారుల సహకారంతో నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
గ్రామాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు లింకు రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పల్లె పండుగ-1, పల్లె పండుగ-2 కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు వివరించారు.
ఇండోసోల్, బీపీసీఎల్ వంటి పరిశ్రమల ద్వారా నియోజకవర్గంలోని చదువుకున్న యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు.
అమ్మవారిపాలెం చెరువును రూ.20 లక్షలతో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. గ్రామ సమీపంలోని ఎలికేరుపై ఏడాదిలోపు వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్సీ కాలనీ వాసులకు త్వరలో ఇళ్ల పట్టాలు అందించేలా చర్యలు తీసుకుంటామని, గ్రామంలో మూడు బోర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రీ-సర్వే ద్వారా గతంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
కార్యక్రమాల్లో గ్రామ టీడీపీ అధ్యక్షుడు ముప్పా వీరశేఖర్, క్లస్టర్ ఇన్‌చార్జిలు చిత్తారి మల్లికార్జున, ఉమ్మనేని సుబ్బారావు, సొసైటీ అధ్యక్షులు నరాల మాలకొండారెడ్డి, దామా వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ డీఈ మాలకొండయ్య, మాజీ ఎంపీపీ ఏసుదాసు, టీడీపీ నాయకులు ఉన్నం వెంకటేశ్వర్లు, వెంకయ్య, మేకల మాల్యాద్రి, వేణు, రాఘవులు, మద్దసాని కృష్ణ, రమణమ్మ, పద్మ, సుమతి తదితరులు పాల్గొన్నారు.