తిరువూరులో మధిర రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన
తిరువూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా మధిర రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. పట్టణ రూపురేఖలను మార్చేలా రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మధిర రోడ్డుకు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి, ఇరువైపులా 7 మీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు. దీంతో రహదారి వెడల్పు పెరగడంతో పాటు వాహనాల రాకపోకలకు మరింత సౌకర్యం కలగనుంది. అలాగే రోడ్డు మధ్యలో ఆధునిక సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. రాత్రి వేళల్లో రహదారి మరింత వెలుగులతో కనిపించేలా లైటింగ్ పనులు చేపట్టనున్నారు. తిరువూరు పట్టణ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో మౌలిక వసతులను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, పురపాలక ప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.