వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే మంత్రులను జిల్లాల్లో తిరగనివ్వం: మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి
సమస్యలు పరిష్కరిస్తామని ఆర్టీసీ ఈడీ హామీ
హైదరాబాద్, అక్టోబర్ 8 (ఎన్‌టుడే న్యూస్): వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం అన్ని రకాల వైకల్యాలు కలిగిన వారికి రాయితీ బస్సు పాసులు మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
వికలాంగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ఎన్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో గురువారం బస్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్నకు వినతిపత్రం అందజేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈడీ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో వెనుకబడిన వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం వికలాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు కేటాయించిన సీట్లను వారికే అందుబాటులో ఉండేలా కింది స్థాయి వరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆర్టీసీ బస్‌స్టేషన్ల పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్‌లలో వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలని, వారికి షాపుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 10.48 లక్షల మంది వికలాంగులు ఉన్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. మహిళా వికలాంగులతో పాటు పురుష వికలాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.
2016 వికలాంగుల హక్కుల చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాలు కలిగిన వారందరికీ రాయితీ బస్సు పాసులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొన్ని రకాల వైకల్యాలకే పాసులు మంజూరు చేస్తున్నారని, పాసుల జారీ విధానాన్ని చట్ట నిబంధనలకు అనుగుణంగా మార్చాలని కోరారు.
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట్ మాట్లాడుతూ.. వీల్‌చైర్ వినియోగించే, తీవ్ర వైకల్యం కలిగిన వ్యక్తులు సాధారణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అన్ని రకాల బస్సుల్లో లిఫ్ట్ లేదా ర్యాంప్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆర్టీసీలో బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కోశాధికారి ఆర్. వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని ఆర్టీసీ బస్సుల్లో వికలాంగుల రాయితీ పాసులను అనుమతించాలని కోరారు. ప్రస్తుతం కొన్ని సర్వీసుల్లో మాత్రమే రాయితీ వర్తిస్తుండటంతో వికలాంగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు.
సమస్యలు పరిష్కరిస్తాం: ఆర్టీసీ ఈడీ
వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని బస్సుల్లో వికలాంగుల పాసులను అనుమతించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్‌లలో రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేస్తామని, బస్సుల్లో వికలాంగులకు కేటాయించిన సీట్లలో వారే కూర్చునేలా డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. వీల్‌చైర్ వినియోగించే వికలాంగుల కోసం లిఫ్ట్ సౌకర్యం కల్పించే అంశంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, 4 శాతం రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. స్వామి, ఉపేందర్, సహాయ కార్యదర్శులు జె. రాజు, కాశప్ప, గంగాధర్, బాలిశ్వర్, రాష్ట్ర కమిటీ సభ్యులు శశికల, భుజంగారెడ్డి, ప్రకాష్, బాబు, బంగారయ్య, నర్సింహ, భాగ్యలక్ష్మి, లలిత, జయలక్ష్మి, చంద్రమోహన్, బాలయ్య, విజయ్, రాజు, యాదయ్య, సంగప్పతో పాటు వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.