పెనుగొలనులో వైభవంగా గణపతి కళ్యాణం, నిమజ్జనోత్సవం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి కళ్యాణం, నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన పందిరిలో శుక్రవారం రాత్రి గణపతి కళ్యాణం వైభవంగా జరిగింది. రామాలయం అర్చకులు భాస్కరాచార్యులు సిద్ధి, బుద్ధి సమేత గణపతి కళ్యాణాన్ని వేదమంత్రాల పారాయణతో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
పంది వెంకట్రావు, దాసరి శ్రీనివాసరెడ్డి, సుగ్గల విష్ణు, పద్మనాభుని కిషోర్, సుగ్గల హనుమంతరావు, సుగ్గల సత్యనారాయణ, సముద్రాల పాపారావు, కంభంపాటి శ్రీను, చలువాది శ్రీహరి, పద్మనాభుని నవీన్ దంపతులు పీటలపై కూర్చొని కళ్యాణ తంతును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శనివారం భక్తుల సహకారంతో అన్నదానం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మేళతాళాలతో గణపతి నిమజ్జనోత్సవం
పెనుగొలను గ్రామంలోని బోటిపై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొలువుదీరిన గణపతి విగ్రహంతో పాటు మెయిన్ సెంటర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాన్ని శుక్రవారం రాత్రి మేళతాళాల నడుమ ప్రధాన వీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. అనంతరం శివాలయం సమీపంలోని చెరువు వద్ద రెండు గణపతి విగ్రహాలకు నిమజ్జనం నిర్వహించారు.