పెనుగొలనులో వైభవంగా భక్తిశ్రద్ధలతో గణపతి కళ్యాణం
గణపతి కళ్యాణం, కావిడి సేవ, అన్నదానం వైభవంగా పెనుగొలనులో భక్తిశ్రద్ధలతో గణపతి కళ్యాణం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని రంగనాయక స్వామి ఆలయం వెనుక కొలువై ఉన్న గణపతి స్వామికి 9వ రోజు మంగళవారం గణపతి కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకలో రామాలయ అర్చకులు భాస్కరాచార్యులు వేదమంత్రాలు పారాయణం చేస్తూ సిద్ధి, బుద్ధి సమేత గణపతి స్వామి వారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కళ్యాణ కార్యక్రమంలో మీనుగు సాయినాథ్–సాయి ప్రసన్న దంపతులు, కుంచం నాగార్జున–లక్ష్మీ దంపతులు పీటలపై కూర్చొని వివాహ తంతును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు హాజరై గణపతి స్వామి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గణపతికి కావిడి సేవ
పెనుగొలనులో గణపతి స్వామికి కళ్యాణం నిర్వహించే రోజున కావిడి సేవ చేయడం ఎన్నో సంవత్సరాలుగా సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ మంగళవారం కావిడి సేవను ఘనంగా నిర్వహించారు. ముందుగా కావిడికి పసుపు, కుంకుమలు రాసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నం, పప్పు, వివిధ ప్రసాదాలను కావిడిలో ఉంచి భక్తిశ్రద్ధలతో తీసుకువచ్చి గణపతి స్వామికి నివేదించారు.
భక్తులకు అన్నదానం
కావిడి సేవ అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదానంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. గణపతి ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించి కార్యక్రమాలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు.