బాలికలు క్రీడల్లోనూ రాణించాలి: మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ సుజాత రామనాథం
మధిర, సెప్టెంబరు 28: విద్యార్థులు చిన్ననాటి నుంచే చదువుతో పాటు ఏదో ఒక క్రీడను ఎంచుకుని నిరంతరం సాధన చేస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత రామనాథం అన్నారు.
మధిరలోని టీవీఎం పాఠశాలలో సోమవారం నిర్వహించిన బాలికల క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం, బహుమతి ప్రదానోత్సవానికి సుజాత రామనాథం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులను చిన్ననాటి నుంచే గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఉంటే విద్యార్థులు ఏ రంగంలోనైనా ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగగలరని పేర్కొన్నారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థినులు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన పీవీ సింధి ప్రస్థానం విద్యార్థినులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. టీవీఎం పాఠశాల విద్యార్థినులు కూడా క్రీడల్లో ప్రతిభ చాటుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
అనంతరం వివిధ క్రీడా విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు సుజాత రామనాథం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నగరికంటి రాజేశ్వరి, పాఠశాల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు పాటిబండ్ల సత్యంబాబు, అంజన బాబు, ప్రవీణ్ రెడ్డి, పీఈటీ చిన్ని, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.