ఘనంగా అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ జయంతి
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం తుమ్మగూడెంలోని మండల ప్రజా పరిషత్ ఉర్దూ పాఠశాలలో అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంపా వెంకటరావు గురజాడ చిత్రపటానికి నివాళులర్పించి, విద్యార్థులకు ఆయన జీవిత విశేషాలు, సాహిత్య సేవలను వివరించారు.
గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21న జన్మించారని తెలిపారు. ‘‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’’ అంటూ గురజాడ పలికిన మాటలు శతాబ్దం దాటినా సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. కులం, మతం, ఆచారాల కంటే మానవత్వం గొప్పదని, మనిషిని మనిషిగా గౌరవించే సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గురజాడ తన రచనల ద్వారా చాటిచెప్పారని పేర్కొన్నారు.
ఆచారం కంటే ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి మనిషికి సమాన గౌరవం లభించే సమాజం కోసం అడుగులు ముందుకు సాగాలని ఆయన సందేశాలు తెలియజేస్తున్నాయని అన్నారు. గురజాడను స్మరించుకోవడం అంటే కేవలం జయంతి వేడుకలు నిర్వహించడం, పూలమాలలు వేయడం మాత్రమే కాదని, ఆయన ఆశయాలను జీవితంలో ఆచరించడమే నిజమైన నివాళి అని గంపా వెంకటరావు విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని గురజాడ అప్పారావు సాహిత్య సేవలను స్మరించుకున్నారు.