తిరువూరులో మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం తిరువూరులోని శ్రీనిధి ఉన్నత పాఠశాల వసతి గృహంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు యం. రాం ప్రదీప్, జిల్లా ఉపాధ్యక్షుడు యం. హరికృష్ణ మాట్లాడుతూ శాంతి, అహింస మార్గాల ద్వారా దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహాత్మా గాంధీ విశేష కృషి చేశారని తెలిపారు. గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మద్యం, మాదకద్రవ్యాల వంటి వాటికి లోనుకాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు పి. శీనయ్య, సీనియర్ నాయకుడు కె. పాపారావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.