చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
డోంకేశ్వర్, సెప్టెంబర్ 26: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు డోంకేశ్వర్ మండలం అన్నారం గ్రామంలో శనివారం భూమి పూజ నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అత్తోలి సంజీవ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, సంఘ నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అత్తోలి సంజీవ్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం రజాకారులు, దొరలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చూపిన ధైర్యం, పట్టుదల నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
నాటి రాచరిక వ్యవస్థను ధైర్యంగా ఎదురించి రైతాంగ హక్కుల కోసం పోరాడిన వీరవనితగా చాకలి ఐలమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
గ్రామంలో ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆమె పోరాట చరిత్రను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు, ఆమె స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని రజక సంఘం నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు సంతోష్, గ్రామ అధ్యక్షురాలు సుజాత, సంఘ సభ్యులు గంగాధర్, గణపతి, భోజన్న, గణేష్, అశోక్, ముత్తన్న, సాయన్న, పోషన్న తదితరులతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.