నిరుద్యోగ సమస్యపై యువతలో పెరుగుతున్న ఆవేదన
ఉద్యోగం అడగడం బిక్ష కాదు.. అర్హతకు తగిన ఉపాధి కోరడం యువత హక్కు: జెస్సు అనిల్ కుమార్
నిరుద్యోగ సమస్యపై బీజేపీ రాష్ట్ర నాయకుడు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్ స్పందించారు. చదువుకున్న యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు లభించకపోవడం ఆందోళన కలిగిస్తోందని, పాలకులు ఇచ్చిన హామీల అమలుపై యువతలో ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల త్యాగాలు
ఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఎన్నో కలలు కనేవారని అనిల్ కుమార్ పేర్కొన్నారు. తమ జీవితాల్లో ఎదురైన కష్టాలు పిల్లలకు రాకూడదనే ఉద్దేశంతో ఎన్నో త్యాగాలు చేసేవారని తెలిపారు.
అప్పులు చేసి అయినా పిల్లలను చదివించడం, తమ అవసరాలను పక్కన పెట్టి వారి భవిష్యత్తు కోసం ప్రతి రూపాయి ఖర్చు చేయడం వంటి ఎన్నో కష్టాలు పడేవారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చదువుకున్న యువతకు తగిన ఉపాధి అవకాశాలు అందకపోవడం తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలను ప్రశ్నార్థకంగా మారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి కోరడం యువత హక్కు
ఉద్యోగం అడగడం బిక్ష కాదని, అర్హతకు తగిన ఉపాధి కోరడం తప్పు కాదని జెస్సు అనిల్ కుమార్ అన్నారు. యువత తమ భవిష్యత్తు కోసం ప్రశ్నించడం వారి హక్కుతో పాటు బాధ్యత కూడా అని పేర్కొన్నారు.
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పాలకులు ఇచ్చిన హామీలను అమలు చేసి, చదువుకున్న యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు.