తుపాను ప్రభావంతో భారీ వర్షాలు.. ఎన్టీఆర్ జిల్లాలో హై అలర్ట్
తుపాను ప్రభావంతో రానున్న 2–3 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు తమకు కేటాయించిన హెడ్‌క్వార్టర్స్‌లోనే తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని స్పష్టం చేశారు.
లోతట్టు ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గతంలో వరదల ప్రభావానికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆర్‌డీఓలు, తహసీల్దార్లు తమ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.
అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. విజయవాడలోని కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
మండల, రెవెన్యూ డివిజన్, కలెక్టరేట్ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 91549 70454 నంబర్‌కు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సమాచారంపై తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు.
వర్షాలు, వరదలకు సంబంధించిన సమస్యలపై రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, వైద్య–ఆరోగ్య, నీటిపారుదల శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిబ్బంది, వాహనాలు, అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
తుపాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ, ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితులు ఏర్పడిన వెంటనే సహాయ చర్యలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కలెక్టర్ కోరారు.