నల్గొండ జిల్లాలో మానవ హక్కుల ఫిర్యాదులు తగ్గాయి
-రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్
గతేడాది 45–50 కేసులు.. ఈ ఏడాది ఇప్పటివరకు ఐదే
NTODAY NEWS ; నల్లగొండ
నల్గొండ జిల్లాలో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి అందుతున్న ఫిర్యాదులు గణనీయంగా తగ్గాయని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ తెలిపారు. గతేడాది జిల్లాలో 45 నుంచి 50 వరకు ఫిర్యాదులు అందగా, ఈ ఏడాది ఇప్పటివరకు ఐదు ఫిర్యాదులు మాత్రమే వచ్చినట్లు వెల్లడించారు. అధికారుల సమన్వయం, బాధ్యతాయుతమైన స్పందనతో బాధితులకు సత్వర న్యాయం అందుతోందని పేర్కొన్నారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి, అక్కడ అందిస్తున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జస్టిస్ షమీమ్ అక్తర్ మాట్లాడుతూ.. విద్య, వైద్యం, భూ వివాదాలు, సీనియర్ సిటిజన్ల సమస్యలతో పాటు పోలీసు, రెవెన్యూ శాఖలకు సంబంధించిన అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.