సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ
వలిగొండ, అక్టోబర్ 28: మధ్యాహ్న భోజన పథకంలో సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేసి, గతంలో మాదిరిగానే పాఠశాలల్లో వంటలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బోలగాని సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ డిమాండ్ చేశారు.
ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లారు. ఎమ్మెల్యే, ఆయన పీఏ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2023–24 సంవత్సరానికి సంబంధించి తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాల వారీగా పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు, ఎన్నికల సమయంలో ప్రకటించిన వంట కార్మికుల నెలవారీ గౌరవ వేతనం రూ.10,000 అమలు చేయాలని కోరారు.
వంట కార్మికులకు కోడిగుడ్లు, గ్యాస్, నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేయాలని, కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో చేసిన వంటలకు సంబంధించిన బిల్లులు, పారితోషిక బకాయిలను చెల్లించాలని, ప్రధాన బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు.
రాజకీయ కారణాలతో వంట కార్మికులను విధుల నుంచి తొలగించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థికి మెస్ ఛార్జీ కింద రూ.25 చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి, మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి సామల శోభన్ బాబు, మధ్యాహ్న భోజన పథకం జిల్లా ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, నాయకులు సామల పద్మ, మహేశ్వరి, అరుణ, లలిత, నిర్మల, వీరస్వామి, పుష్ప, అండాలు పాల్గొన్నారు.