డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు
400 మంది విద్యార్థులకు ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన
రామన్నపేట, అక్టోబర్ 28: బాలలు ఇంటర్నెట్‌ను సురక్షితంగా వినియోగిస్తూ, సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని రామన్నపేట అదనపు జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ వి. రత్నకుమారి సూచించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం రామన్నపేటలోని డాన్ బోస్కో హైస్కూల్‌లో ‘సురక్షిత్ క్లిక్ – సురక్షిత్ బచ్‌పన్’ అనే అంశంపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తి సుమారు 400 మంది విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్నెట్ వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, సోషల్ మీడియా ద్వారా ఎదురయ్యే ప్రమాదాలు, సైబర్ వేధింపులు, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, పాస్‌వర్డ్‌లను అపరిచితులతో పంచుకోకూడదని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద లింకులను తెరవకూడదని వివరించారు. సైబర్ వేధింపులు, బెదిరింపులు లేదా అనుచిత సందేశాలు ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. అవసరమైనప్పుడు పోలీసులను లేదా సంబంధిత అధికారులను సంప్రదించి న్యాయ సహాయం పొందాలని విద్యార్థులకు వివరించారు.
బాలల హక్కులు, వ్యక్తిగత సమాచార పరిరక్షణ, డిజిటల్ ప్రపంచంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగంపై చిన్న వయస్సు నుంచే అవగాహన పెంపొందించుకోవడం అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ కూనూరు శ్రీనివాస్ గౌడ్, పారా లీగల్ వాలంటీర్ కుర్మటి యాదయ్య, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ సభ్యుడు కె. శ్రీశైలం, పాఠశాల ప్రిన్సిపాల్ చిట్టిబాబు, అకడమిక్ డైరెక్టర్ పి. జనార్దన రావు, ఉపాధ్యాయులు జి. నవీన్ కుమార్, సయ్యద్ ఖదీర్, హీన, సి.హెచ్. విజయలక్ష్మి, హిరణ్మయి, మత్యగిరి, భవాని, వనజాత, బి. సునీత, అనిరుధన్, సుమ, మాధవి, పద్మ, శ్రీలత, రేష్మ తదితరులు పాల్గొన్నారు.