జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా
- ప్రథమ స్థానం కైవసం.. రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురు విద్యార్థినుల ఎంపిక
- రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురి ఎంపిక
- విద్యార్థినులకు ఉపాధ్యాయుల అభినందనలు
మహబూబాబాద్, అక్టోబర్ 28: జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో నర్సింహులపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. మహబూబాబాద్ జిల్లా ఎన్‌టీఆర్ స్టేడియంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించిన పీఎం శ్రీ జిల్లాస్థాయి టోర్నమెంట్‌లో బాలికల వాలీబాల్ విభాగంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ పోటీల్లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన నర్సింహులపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థినులు వైశాలి, కళ్యాణి, లాస్య, అయేషా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో విజయం సాధించడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాలలో ఆనందం వ్యక్తమైంది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. రామ్మోహనరావు, ఉపాధ్యాయ బృందం విద్యార్థినులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఇదే ఉత్సాహంతో ఆడి పాఠశాలకు, నర్సింహులపేట మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.