సికింద్రాబాద్ రైల్వే నిలయం ఎదుట కాంగ్రెస్ మెరుపు ధర్నా
ఢిల్లీ నిరసనకు ప్రత్యేక రైళ్లు కేటాయించాలని డిమాండ్.. మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ సహా పలువురు నేతల అరెస్ట్
సికింద్రాబాద్, అక్టోబర్ 28: నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న కాంగ్రెస్ నిరసన కార్యక్రమానికి ప్రత్యేక రైళ్లు కేటాయించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిరాకరించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం సికింద్రాబాద్ రైల్వే నిలయం ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు. రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమానికి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు రైల్వే శాఖను కోరారు. అయితే రైళ్ల కేటాయింపునకు అనుమతి లభించకపోవడంతో నిరసనకు దిగారు. రైల్వే అధికారులు తమ విజ్ఞప్తిని పునఃపరిశీలించి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘురాం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేష్, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, దీపక్ జాన్ తదితర నాయకులు పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు.
ధర్నా నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలను సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.