మెరుగైన పీఆర్సీ సాధనకు కృషి చేస్తా : ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి
NTODAY NEWS : చిట్యాల
ఉపాధ్యాయ, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ సాధించే విషయంలో తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. చిట్యాల పురపాలక పరిధిలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బోడ సుశీల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సంక్షేమానికి పీఆర్టీయూ సంఘం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి భావసారూప్యత కలిగిన సంఘాలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మెరుగైన పీఆర్సీ సాధన కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. దేశ పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బోడ సుశీలతో పాటు ఉపాధ్యాయులు చిలకరాజు శ్రీనివాస్, ఏ. పద్మజ, కోణం శ్రీనివాస్, సీహెచ్. ప్రసన్న, ఎండీ. సాదిక్, ఎం. సౌమ్య, ఎస్. ప్రవీణ్‌లు ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డికి పూల మొక్కను అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు కంచరకుంట్ల సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి ఎలకరాజు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.