సీఎం పర్యటనకు సభా వేదిక, హెలిప్యాడ్ స్థలాల పరిశీలన
అన్నమయ్య జిల్లా, సెప్టెంబర్ 25: రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న అన్నమయ్య జిల్లాకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన స్థలాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి శుక్రవారం పరిశీలించారు.
ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ నిర్వహణకు అనువైన ప్రాంతంతో పాటు హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అవసరమైన హెలిప్యాడ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను అధికారులు పరిశీలించారు. బీకేపల్లి ప్రాంతం, కళాశాల పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రత్యామ్నాయ ప్రదేశాలను పరిశీలించి, కార్యక్రమ నిర్వహణకు అనువైన స్థలాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.
ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకొని సభా వేదిక, హెలిప్యాడ్, భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ తదితర ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులను ఆదేశించారు. పర్యటనకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.