రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డగింత
5 టన్నుల బియ్యం, వాహనం స్వాధీనం
ఏలూరు జిల్లా దెందులూరు మండలం దెందులూరు హైవేపై పున్నమి హోటల్ సమీపంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అధికారులు అడ్డుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు ఏలూరు విజిలెన్స్ అధికారులు, దెందులూరు సీఎస్‌డీటీ, గ్రామ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
పెదవేగి మండలం వైపు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం (AP39UZ7693)లో ప్రభుత్వ పథకం ద్వారా పేదలకు ఉచితంగా అందించే రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాహనంలో 50 కిలోల చొప్పున 100 బస్తాల్లో మొత్తం 5,000 కిలోల రేషన్ బియ్యం ఉన్నట్లు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.2 లక్షలు, వాహనం విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం కొనుగోలు, రవాణాకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.