డెంగీతో ఇంటర్ విద్యార్థిని మృతి
మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ముర్తుజగూడలో విషాద ఘటన చోటుచేసుకుంది. మణికొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న సామ రిషితారెడ్డి (17) అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రిషితారెడ్డి ఇటీవల జ్వరంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే కళాశాలకు హాజరవుతూ చదువును కొనసాగించారు. అయితే మూడు రోజుల క్రితం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతున్న రిషితారెడ్డి సోమవారం మృతి చెందారు. డెంగీ కారణంగానే ఆమె మృతి చెందినట్లు మొయినాబాద్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వెల్లడించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
యువతి మృతితో ముర్తుజగూడలో విషాదఛాయలు అలుముకున్నాయి. రిషితారెడ్డి మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.