శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం చేయాలి
40 ఏళ్లుగా కొనసాగుతున్న నిర్వాసితుల నిరీక్షణకు తెరదించాలి: ఏఐకేఎం రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ఇళ్లు, పొలాలు కోల్పోయి నిర్వాసితులైన బాధితులకు న్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ డిమాండ్ చేశారు. 40 ఏళ్లుగా సమస్య పరిష్కారం కోసం బాధితులు ఎదురుచూస్తున్నారని, 195 రోజులుగా రిలే దీక్షలు కొనసాగిస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు.
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల అనేక మంది ప్రయోజనం పొందుతున్నప్పటికీ, ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన 674 కుటుంబాల పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరినాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 98 ప్రకారం నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో త్యాగాలు చేసిన నిర్వాసితుల సమస్యలపై గతంలో పలువురు ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారని హరినాథ్ తెలిపారు. నందమూరి తారక రామారావు ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని పేర్కొన్నారు. చంద్రబాబు 2017, 2019, 2024లో నిర్వాసితులకు హామీలు ఇచ్చారని, లోకేష్ 2024లో యువగళం పాదయాత్ర సందర్భంగా నందికొట్కూరులో సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
ఖాళీగా ఉన్న లస్కర్ పోస్టులను శ్రీశైలం ముంపు బాధిత కుటుంబాలతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ సాయిప్రసాద్‌కు ప్రతిపాదనలు పంపినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న పలువురు వయోపరిమితి దాటిపోతుండటంతో అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
నిర్వాసితుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని హరినాథ్ కోరారు. సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు పిక్కిలి వెంకటేశ్వర్లు తెలిపారు.