BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 03 September 2026, 09:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కోడూరులో రాంప్రదీప్‌కు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 09:36 PM
15 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం కోడూరు మోడల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మందడపు రాంప్రదీప్‌కు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రకటించింది. విద్యారంగంతో పాటు సామాజిక సేవ, రచనా రంగాల్లో ఆయన చేస్తున్న నిరంతర కృషిని గుర్తించి ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

కోడూరు మోడల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా గత సంవత్సరం బదిలీపై వచ్చిన రాంప్రదీప్, బాధ్యతలు స్వీకరించిన వెంటనే గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి తల్లిదండ్రులకు విద్య ప్రాధాన్యతను వివరించారు. ఆయన కృషితో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 63 నుంచి 86కు పెరిగింది.

గతంలో గానుగపాడు పాఠశాలలో పనిచేసిన సమయంలో ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా వర్గోన్నతి కల్పించేందుకు విశేషంగా కృషి చేశారు. దాతల సహకారంతో రూ.50 లక్షల విలువైన స్థలాన్ని, రూ.5 లక్షల విరాళాలను సమీకరించి నూతన భవనాల ఏర్పాటుకు కృషి చేశారు.

ఆంగ్ల భాషా ఉపాధ్యాయుల ప్రతినిధిగా తిరువూరు నియోజకవర్గంలోని వివిధ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఆంగ్ల భాషపై మెళకువలు నేర్పుతున్నారు. విద్యార్థుల కోసం ‘క్లాస్ రూమ్ ఇంగ్లీష్’ పుస్తకాన్ని రచించి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

‘భారతదేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞ రచయితను వెలుగులోకి తెచ్చిన పరిశోధన

పాఠశాలలో ప్రతిరోజూ విద్యార్థులు చెప్పే ‘భారతదేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞ రచయిత ఎవరని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానం కోసం రాంప్రదీప్ పరిశోధన ప్రారంభించారు. అజ్ఞాతంగా ఉన్న ఆ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు అని వెలికితీశారు. అనంతరం ఆయన జీవిత చరిత్రను పుస్తకంగా రచించడంతో పాటు పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును పాఠ్యపుస్తకాల్లో ప్రచురించేలా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి సాధించారు.

జన విజ్ఞాన వేదిక సభ్యుడిగా, సామాజిక కార్యకర్తగా వివిధ అంశాలపై నాలుగు వేలకు పైగా వ్యాసాలు రచించారు. మిత్రులు, పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇబ్బందులు పడుతున్న పలువురు విద్యార్థులకు సహాయం అందేలా కృషి చేశారు.

సినీ నటుడు సోనూ సూద్ సహకారంతో గుండె జబ్బులతో బాధపడుతున్న 17 మంది బాలబాలికలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించడంలో కీలకంగా వ్యవహరించారు.

కిడ్నీ సమస్యపై తొలుత గళమెత్తి.. డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు కృషి

ఏ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను తొలిసారిగా వెలుగులోకి తీసుకువచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సమస్యపై ఉద్యమించడంతో ఏ.కొండూరు, తిరువూరులో ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

గత 15 సంవత్సరాలుగా స్వచ్ఛంద బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బడి బయట ఉన్న అనేక మంది పిల్లలను తిరిగి పాఠశాలలకు పంపేలా కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వేసవిలో విద్యార్థులకు ఉచితంగా మాట్లాడే ఆంగ్ల భాషపై శిక్షణ ఇస్తున్నారు.

రాంప్రదీప్ సేవలను గుర్తించి గతంలో గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శిరిడి సాయిబాబా సేవా కమిటీ, తిరువూరు రచయితల సంఘం తదితర సంస్థలు ఘనంగా సన్మానించాయి.

మంచి విద్యావేత్తగా, నిరంతర కృషీవలుడిగా రాంప్రదీప్ అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడం తిరువూరు నియోజకవర్గానికే గర్వకారణమని పెనుగొలను శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, విశ్రాంత ఎంఈఓ వి.శేషిరెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, పలువురు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.