గంగారంలో ఘనంగా కొమరం భీం 86వ వర్ధంతి
- విగ్రహ స్థాపనకు భూమి పూజ నిర్వహణ
- భారీ ర్యాలీ.. ఘన నివాళులు
- కొమరం భీం విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
గంగారం, మహబూబాబాద్ జిల్లా, అక్టోబర్ 28 | ఎన్ టుడే న్యూస్: ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నాయకుడు కొమరం భీం 86వ వర్ధంతి కార్యక్రమాన్ని గంగారం మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ), ఆదివాసీ సర్పంచ్‌లు, ఆదివాసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
“భీం అమర్ రహే”, “ఆదివాసీ హక్కుల కోసం పోరాడాలి” అంటూ నినాదాలు చేస్తూ నాయకులు, ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
గంగారం మండల కేంద్రంలో కొమరం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నాయకులు, ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు. ఆదివాసీ సమాజానికి ఆయన చేసిన సేవలు, హక్కుల కోసం సాగించిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జెజ్జరి రాము, తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర్కా యాదగిరి, సువర్ణపాక వెంకటరత్నం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసం నాగేశ్వరరావు, ఆదివాసీ ఉద్యోగులు ముడిగ రామచందర్, బ్రహ్మయ్య, చుంచ శ్రీను, సారయ్య, మొల్కం లక్ష్మీనర్సు, జెజ్జరి శివ, సర్పంచ్‌లు ఈసం సురేష్, బచ్చల లక్ష్మణరావు, గ్రామ పెద్దలు చింత రవి, బూర్కా శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.