చనుబండలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో శుక్రవారం భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ చనుబండ కార్యక్రమాన్ని చేపట్టి, శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శ్రీకర్ బుర్రి మాట్లాడుతూ, లాల్ బహదూర్ శాస్త్రి దేశం గర్వించదగ్గ నాయకుడని, నిరాడంబరత, నిజాయితీ, క్రమశిక్షణ, దేశభక్తికి ఆయన జీవితం ఆదర్శమని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న శాస్త్రి, స్వాతంత్ర్యానంతరం పలు కీలక బాధ్యతలు నిర్వహించి, 1964లో భారత రెండో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. 1965 భారత్–పాకిస్థాన్ యుద్ధ సమయంలో సైనికుల సేవలను, రైతుల కృషిని గుర్తిస్తూ ఆయన ఇచ్చిన ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదం దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపిందన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మరణానంతరం భారతరత్న పురస్కారం లభించిందని వివరించారు.
అనంతరం గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమాలకు సహకరిస్తున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కొండ తాతయ్య బాబును శాలువాతో సత్కరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా చనుబండ గ్రామ సచివాలయంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.