తుమ్మిడిహట్టి బ్యారేజీకి మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలి
తుమ్మిడిహట్టి బ్యారేజీకి మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలి: కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
- సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు
- సమ్మక్కసాగర్ అనుమతులపై విజ్ఞప్తి
- టెలీమెట్రీ ఏర్పాటును వేగవంతం చేయాలి
ఢిల్లీ: తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు ఇప్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించినట్లు కేంద్ర మంత్రికి వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర అంశాలపై చర్చించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీని ఎఫ్‌ఆర్‌ఎల్ +152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య త్వరగా అంగీకారం కుదిరేలా కేంద్రం చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ స్థాయిలో బ్యారేజీ నిర్మిస్తే ఎల్లంపల్లి వైపు గ్రావిటీ ఆధారంగా నీటిని తరలించే అవకాశం ఉంటుందని, తద్వారా నీటి తరలింపునకు అవసరమైన విద్యుత్ వినియోగం, వ్యయం తగ్గుతుందని వివరించారు. గతంలో 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌పై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం 150–152 మీటర్ల స్థాయికి అనుమతి కోరుతోంది.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS), డిండి ఎత్తిపోతల పథకం (DLIS), సీతారామ సాగర్ బహుళార్థక ప్రాజెక్టు (SSMP), గౌరవెల్లి రిజర్వాయర్‌కు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.
ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పర్యావరణ అనుమతులకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో, ఆయా ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అనుమతుల జాప్యం కారణంగా ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతోందని తెలిపారు.
సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం (CWC) వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులను త్వరగా మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను CWCకి సమర్పించినట్లు, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం పొందేందుకు చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) ఆధ్వర్యంలో చేపడుతున్న టెలీమెట్రీ పరికరాల ఏర్పాటును వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. మొదటి దశ టెలీమెట్రీ పరికరాల ఏర్పాటుకు అవసరమైన రూ.4.15 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
మొదటి దశ టెలీమెట్రీ పరికరాల ఏర్పాటుతో పాటు రెండో, మూడో దశలకు సంబంధించిన పరికరాలను కూడా త్వరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.