ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ తెలంగాణ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి: ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి ఉగ్గం సురేష్
మధిర: ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో హనుమకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న మూడు రోజుల తెలంగాణ రాష్ట్ర మహాసభలను విద్యార్థులు, యువత, విద్యావేత్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి ఉగ్గం సురేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ బీసీ హాస్టల్‌లో ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉగ్గం సురేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ వస్తున్న చారిత్రక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. విద్య ప్రతి విద్యార్థి హక్కు అని, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాల్సిన సమయంలో విద్యా రంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పెరగడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులపై ఆర్థిక భారం పెరుగుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు తగినంత మంది అధ్యాపకులు, సిబ్బందిని నియమించి అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు.
విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని, విద్యార్థులకు సరిపడా హాస్టల్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
హనుమకొండ జిల్లాలో నిర్వహించనున్న ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ తెలంగాణ రాష్ట్ర మహాసభలకు విద్యార్థులు, యువత, విద్యావేత్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఉగ్గం సురేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మధిర మండల కార్యదర్శి కళ్లెం అశోక్, మండల సహాయ కార్యదర్శి గుగులోత్ హుస్సేన్, విద్యార్థులు ఆది, వినయ్, కిరణ్, ప్రణయ్, బాబు, లోకేష్, మోహిత్, అనిరుద్ గౌడ్, నందు, సంతోష్, రాజేష్, యశ్వంత్, మణికంఠ, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.