ఒంగోలు గిత్తల ప్రత్యేక ప్రదర్శనకు భారీ ఏర్పాటు
ఒంగోలు: ఒంగోలు నగరపాలక సంస్థ 150 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నగరంలో ఒంగోలు గిత్తల ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రదర్శన జరగనుంది.
ఒంగోలు మినీ స్టేడియం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక ప్రదర్శనలో 150కి పైగా ఒంగోలు గిత్తలు పాల్గొననున్నాయి. ఒంగోలు జాతి గిత్తల విశిష్టతను చాటిచెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా సుమారు రూ.15 లక్షల వ్యయంతో రెండు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు మొత్తం 16 బహుమతులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి గిత్తల జతకు రూ.10 వేల చొప్పున రవాణా ఖర్చు అందించనున్నారు.
ఈ ప్రత్యేక ప్రదర్శన, పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పర్యవేక్షిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.