మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేతనం చెల్లించాలి
మంచిర్యాల: మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న జీతాలు, బిల్లులను వెంటనే విడుదల చేయాలని మంచిర్యాల సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షురాలు మధునమ్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం అమలు చేయాలని రంజిత్ కుమార్ కోరారు. కార్మికులకు సంబంధించిన పెండింగ్ జీతాలు, బిల్లులను ఎలాంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పథకాన్ని కార్మికుల ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ఉద్యోగ భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గత 20 ఏళ్లుగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని సంఘం జిల్లా కార్యదర్శి ఎం.డి. రఫీయా పేర్కొన్నారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 12న జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాకు మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి సవిత, నాయకులు వెంకటలక్ష్మి, భాగ్య తదితరులు పాల్గొన్నారు.