సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సమావేశం
కనిగిరి, Ntoday News, సెప్టెంబర్ 26: ఈ నెల 29న నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం కనిగిరిలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
రామాపురంలో నిర్వహించనున్న సీఎం పర్యటన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సూచించారు. పర్యటన విజయవంతంగా జరిగేలా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ నెల 29న రామాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘పల్లె పండుగ–3.0’ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఇప్పటికే అధికారిక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్, ప్రజల రాకపోకలు, భద్రత తదితర ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.
కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించి కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.