ఎన్‌ఐటీ వరంగల్–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ
విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం
హనుమకొండ, అక్టోబర్ 9 (N Today News): విద్య, పరిశోధన, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఎన్‌ఐటీ వరంగల్, సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. హనుమకొండలోని ఎన్‌ఐటీ క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్‌ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి, సుమతిరెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ. రాజశ్రీ రెడ్డి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ద్వారా విద్యార్థినులకు ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు ఉమ్మడి పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు అవకాశాలు లభించనున్నాయి. అలాగే మెరుగైన ఇంటర్న్‌షిప్‌లు, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థినులను తీర్చిదిద్దడం, నైపుణ్యాలను పెంపొందించడం, అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం ఈ ఒప్పందంలోని ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. విద్యాబోధనతో పాటు ఆచరణాత్మక పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఐటీ డీన్ ప్రొఫెసర్ శిరీష్ హరి, సుమతిరెడ్డి కళాశాల ప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు.