ఏ.కొండూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవంలో ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి
ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరులో రూ.94.97 కోట్ల వ్యయంతో నిర్మించిన 220/132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఒకే వేదికపై ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ, కార్యక్రమంలో వారిద్దరి మధ్య పెద్దగా పరస్పర సంభాషణ కనిపించలేదని అక్కడి వర్గాలు తెలిపాయి.
కార్యక్రమం ముగిసిన వెంటనే ఎమ్మెల్యే కొలికపూడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాత్రం అక్కడే ఉండి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి అనంతరం మీడియాతో మాట్లాడారు.
గత కొంతకాలంగా ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య రాజకీయంగా దూరం ఉందనే చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏ.కొండూరు కార్యక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే, కార్యక్రమంలో ఇద్దరి మధ్య మాట్లాడకపోవడానికి వ్యక్తిగతంగా లేదా రాజకీయంగా ఏ కారణమన్నదానిపై సంబంధిత నేతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.