నూజివీడులో జర్నలిస్టులపై దురుసు ప్రవర్తనపై డీఎస్పీకి జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు
నూజివీడు, సెప్టెంబర్ 25: వార్తా సేకరణకు వెళ్లిన జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించి, అసభ్య పదజాలంతో దూషించారంటూ నూజివీడు ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు నూజివీడు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
అసోసియేషన్ ప్రతినిధుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 24న రాత్రి సుమారు 10 గంటల సమయంలో నూజివీడు పట్టణంలోని బాపునగర్ సమీపంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు మద్దిరాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు రవికాంత్, కార్యవర్గ సభ్యులు పీ. ఉదయ్, సత్రపు సుధీర్, వాసాల గిరి అక్కడికి వెళ్లి ఘటనను వీడియో చిత్రీకరిస్తున్నారు.
ఈ సమయంలో చల్లా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తమను దుర్భాషలాడుతూ, వీడియోలు ఎందుకు తీస్తున్నారంటూ దురుసుగా ప్రవర్తించారని జర్నలిస్టులు ఆరోపించారు. మరోవైపు కొంతమంది మహిళలు జర్నలిస్ట్ పీ. ఉదయ్‌ను చుట్టుముట్టి వార్తా సేకరణకు ఆటంకం కలిగించారని తెలిపారు.
ఘటన సమయంలో నూజివీడు రూరల్ ఎస్సై జ్యోతిబసు అక్కడే ఉన్నారని, జర్నలిస్టులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ తమ పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిని నిలువరించేందుకు తగిన చర్యలు తీసుకోలేదని అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రజలకు సంబంధించిన వార్తలను రాత్రి, పగలు తేడా లేకుండా క్షేత్రస్థాయిలో సేకరిస్తున్న జర్నలిస్టులపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ కల్పించాలని వారు డీఎస్పీని కోరారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.