పేదల ఆక్రమణలకు పట్టాలు.. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆహ్వానం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని పాత తిరువూరు రెవెన్యూ గ్రామ పరిధిలో ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకొని ఉంటున్న అర్హులైన పేదల ఆక్రమణలను క్రమబద్ధీకరించి పట్టాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
జీఓ ఎంఎస్ నం.30 ప్రకారం చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అర్హులైన పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో తిరువూరు పాత రెవెన్యూ గ్రామ పరిధిలో పట్టాల కోసం అర్హత సాధించిన సుమారు 15 మంది లబ్ధిదారులను కార్యక్రమానికి ఆహ్వానించేందుకు తిరువూరు ఆర్డీఓ ఏ. కుమార్ స్వయంగా వారి నివాసాలకు వెళ్లారు. లబ్ధిదారులను కలిసి పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అర్హులైన పేదల ఆక్రమణలను క్రమబద్ధీకరించి వారికి పట్టాలు మంజూరు చేయడం ద్వారా సొంత నివాస స్థలంపై హక్కు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆర్డీఓ ఏ. కుమార్ తెలిపారు. కార్యక్రమంలో తిరువూరు తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.