అక్టోబర్ 1 నుంచే వరి కొనుగోళ్లు
తెలంగాణలో వర్షాకాలం సీజన్‌కు సంబంధించిన వరి కొనుగోళ్లను
ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు 8,224 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 56.59 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం సుమారు కోటిన్నర టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పంట కోతలు ప్రారంభమయ్యే ప్రాంతాలను బట్టి కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో ముందుగా వరినాట్లు చేపట్టడంతో అక్కడ పంట కోతలు కూడా ముందుగా ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ రెండు జిల్లాల్లోనే తొలుత ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం పంట కోతలు జరిగే ప్రాంతాల్లో దశలవారీగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.