పీఎండీఎస్ సాగుతో నేల సారం బాగు..
పీఎండీఎస్ సాగుతో నేల సారం బాగు.. రైతుకు ఆదాయ భరోసా ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శంగా నిలిచిన చండ్రుపట్ల రైతు విజయలక్ష్మి
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్ల యూనిట్ పరిధిలోని చండ్రుపట్ల గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పీఎండీఎస్ సాగు మంచి ఫలితాలను అందిస్తోంది. ఐసీఆర్‌పీ సొంత భూమిలో రైతు విస్సంపల్లి విజయలక్ష్మి పీఎండీఎస్ విధానంలో సాగు చేపట్టి ఆదర్శంగా నిలిచారు.
ఒక ఎకరం పొలంలో 30 రకాల పీఎండీఎస్ విత్తనాలను వినియోగించి, మొత్తం 30 కిలోల విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేశారు. అనంతరం విత్తన గుళికలు తయారు చేసి పొలంలో వెదజల్లే విధానంలో సాగు చేపట్టారు.
పంట కోత ప్రయోగంలో భాగంగా 5×5 మీటర్ల విస్తీర్ణంలో పరిశీలన చేయగా 49.600 కిలోల బయోమాస్ దిగుబడి లభించింది. దీని ఆధారంగా ఒక ఎకరం పొలంలో సుమారు 8035.2 కిలోల బయోమాస్ దిగుబడి వచ్చినట్లు లెక్కించారు.
పీఎండీఎస్ సాగులో భాగంగా గోంగూర, వివిధ రకాల కూరగాయల ద్వారా రూ.4,250 ఆదాయం పొందారు. ఈ పంటను ఆవులు, గేదెలకు పశుగ్రాసంగా వినియోగించడంతో పాల శాతం, వెన్న శాతం పెరిగినట్లు గుర్తించారు.
పీఎండీఎస్ సాగు వల్ల భూమి గుల్లబారడం, వానపాముల వృద్ధి పెరగడం, నేలలో తేమ శాతం ఎక్కువ కాలం నిల్వ ఉండటం వంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి. పంటల వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందడంతో తదుపరి పంటల్లో కూడా ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందే అవకాశం ఏర్పడుతోంది.
ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు ఆహార భద్రతతో పాటు ఆదాయ భద్రతను కూడా అందిస్తున్నాయని వ్యవసాయ శాఖ సిబ్బంది తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ శాఖ తాతకుంట్ల యూనిట్ ఇన్‌చార్జి జి. శ్రీనివాసరావు, ఐసీఆర్‌పీలు వి. విజయలక్ష్మి, బీ.వీ. నాగలక్ష్మి, పి. అంజిబాబు, జి. భారతి, లీడ్ ఫార్మర్ టి. మంగతాయారు, అగ్రి గ్రేటర్ వి. పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.