లండన్-చికాగో విమానంలో తీవ్ర పరిణామం.. ఎమర్జెన్సీ కోడ్ 7700
లండన్: లండన్ నుంచి చికాగో వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విమానం సుమారు 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఎత్తు తగ్గినట్లు సమాచారం.
విమానం కొద్దిసేపట్లోనే సుమారు 28 వేల అడుగుల స్థాయికి దిగుతూ, అనంతరం 7 వేల అడుగుల వరకు చేరినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానంలో అత్యవసర పరిస్థితిని సూచించే యూనివర్సల్ ఎమర్జెన్సీ కోడ్ 7700ను ప్రకటించినట్లు తెలుస్తోంది.
అనంతరం విమానాన్ని గమ్యస్థానమైన చికాగో వైపు కొనసాగించకుండా యూటర్న్ తీసుకుని లండన్ హీత్రూ విమానాశ్రయం వైపు మళ్లించినట్లు సమాచారం. విమానం సురక్షితంగా తిరిగి ల్యాండ్ అయ్యేలా సంబంధిత అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
విమానం ఒక్కసారిగా ఎత్తు ఎందుకు తగ్గింది? సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై సంబంధిత అధికారులు, విమానయాన సంస్థ పరిశీలన చేపట్టే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటన అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.