అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
తెలంగాణ
/
నిర్మల్
నిర్మల్: రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించి తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన భూ సర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నివసిస్తున్న అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుడిసెల్లో నివసిస్తున్న సుమారు 72 వేల నుంచి 73 వేల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
మొదటి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టగా, రెండో దశలో మరో రెండు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించి నిర్మాణాలను ప్రోత్సహిస్తామని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ సంబంధిత సమస్యల కారణంగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోకుండా అధికారులు చొరవ తీసుకుని పరిష్కరించాలని సూచించారు. అవసరమైతే ఈ అంశాలపై రాష్ట్రస్థాయిలో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
భూ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి పొంగులేటి తెలిపారు. గతంలో సుమారు 125 ఏళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం వచ్చే ఏడాదిన్నరలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో భూ సర్వే పూర్తి చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రతి భూ కమతానికి ప్రత్యేక గుర్తింపు కల్పించే విధంగా ‘భూ ఆధార్’ రూపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
భూముల సమగ్ర సర్వే పూర్తయితే భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా నిరోధించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.