పల్లెపండుగ–3.0ను పండుగ వాతావరణంలో విజయవంతం చేయాలి
పల్లెపండుగ–3.0ను పండుగ వాతావరణంలో విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు, సెప్టెంబరు 28: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పల్లెపండుగ–3.0 కార్యక్రమాన్ని జిల్లాలో పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
జిల్లాలో సెప్టెంబరు 29 నుంచి వారం రోజుల పాటు పల్లెపండుగ–3.0 కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు రహదారి సౌకర్యం లేని ఆవాసాలకు రహదారి కనెక్టివిటీ కల్పించే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్రజలకు నేరుగా ఉపయోగపడే మౌలిక వసతుల పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, ప్రారంభించిన ప్రతి పనిని అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, నిర్మాణ పనుల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
పల్లెపండుగ–3.0లో చేపట్టే అభివృద్ధి పనుల వల్ల గ్రామీణ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు, రవాణా సౌలభ్యం అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. చేపట్టిన ప్రతి పని ప్రజలకు పూర్తి సంతృప్తి కలిగించేలా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే పల్లెపండుగ–3.0లో భాగంగా చేపట్టే అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.