పోలవరంలో సేవా సంకల్ప అభియాన్
ఉచిత వైద్య శిబిరంలో గ్రామస్థులకు వైద్య పరీక్షలు.. ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తి చేయాలని విజ్ఞప్తి
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో బీజేపీ నాయకుడు చాగంటి వాసుదేవరావు సహకారంతో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన మాసోత్సవాల్లో భాగంగా చేపట్టిన సేవా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని చాట్రాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దుర్గాప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు వారి నివాస ప్రాంతాలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉన్న వైద్య సేవలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం శిబిరాల ప్రధాన లక్ష్యమన్నారు.
శిబిరంలో మధుమేహం, రక్తపోటు తదితర సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి మందులు అందిస్తామని చెప్పారు. మరింత మెరుగైన వైద్య పరీక్షలు అవసరమయ్యే వారికి, అత్యవసర వైద్య సేవలు అవసరమైన సందర్భాల్లో సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేస్తామని వివరించారు. ప్రజలు చిన్నపాటి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ వైద్య కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
టీడీపీ సీనియర్ నాయకుడు చాగంటి నరసింహారావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన మాసోత్సవాలను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. సేవా సంకల్ప అభియాన్ ద్వారా ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
పోలవరం ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం సీహెచ్‌ఓ రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామంలోని సందుల్లో అద్దె ఇళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించాల్సి రావడం వల్ల వైద్య సిబ్బందికి, వైద్యం కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పోలవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి పునాది వేసినప్పటికీ పనులు మధ్యలోనే నిలిచిపోయాయని వివరించారు. భవన నిర్మాణం త్వరగా పూర్తయితే గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఈ సమస్యను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్‌ను కోరారు. గ్రామంలో శాశ్వత వైద్య సదుపాయం అందుబాటులోకి వస్తే పోలవరం ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బుర్రి శ్రీకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్–ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం, 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు అందించే ఆరోగ్య బీమా వంటి పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ వివరించాలని సూచించారు.
ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి వైద్య పరీక్షలు, మందులు అందించడం సేవా కార్యక్రమాల్లో ముఖ్యమైన భాగమని శ్రీకర్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
చాట్రాయి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణ సమస్యలపై ఇప్పటికే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు శ్రీకర్ తెలిపారు. ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్‌కు కూడా సమస్యలపై ప్రాతినిధ్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
పోలవరం ఆరోగ్య కేంద్రం నిర్మాణ అంశంపై మరోసారి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి పరిస్థితిని వివరిస్తామని శ్రీకర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండటం అత్యంత అవసరమని, భవనాలు, మౌలిక వసతులు పూర్తయితే వైద్య సిబ్బంది కూడా మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.
శిబిరానికి వచ్చిన గ్రామస్థులకు వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు అందించారు. మహిళలు, వృద్ధులు, సాధారణ ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారికి వైద్య సిబ్బంది పరీక్షలు చేసి తగిన సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు చాగంటి వాసుదేవరావు, అక్కిరాజు వీర రాఘవరాజు, వైద్య సిబ్బంది జానకి రత్నం, బి. ప్రభాకర్, జి. శ్రీదేవి, శాంతిజ్యోతి, సామ్రాజ్యం, డి. సురేష్, ప్రభాకర్, జి. ప్రకాష్, బి. వీరస్వామి, ఎం. కృష్ణవేణి, విజయలక్ష్మి, వేరోనిక, బేబీ కుమారి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు.