ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ప్రారంభం
ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ప్రారంభం
లక్షెట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల | Ntoday News
మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను మెరుగైన వైద్యం అందించే ఆసుపత్రులకు సురక్షితంగా తరలించేందుకు వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.
పేద, సామాన్య ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రతిమ ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్యం అందించేందుకు ఈ సేవలు ప్రజలకు మరింత భరోసా కల్పిస్తాయని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్ ఆసుపత్రిని సందర్శించి వైద్యులతో మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ రామచందర్ రావు, ప్రతిమ హాస్పిటల్ క్రిటికల్ కేర్ వైద్యుడు డాక్టర్ ప్రవీణ్, లక్షెట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, లక్షెట్టిపేట్ మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మంచిర్యాల జిల్లా ఆర్‌టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, లక్షెట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి–నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరు రాజేశ్వరి–వెంకట స్వామి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ షాహిద్ అలీ, మండల అధ్యక్షులు, సర్పంచ్ నలిమెల రాజు, సింగిల్ విండో చైర్మన్లు నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, జిల్లా RGPRS అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, జిల్లా నాయకుడు పూర్ణచంద్రరావుతో పాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.