ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ
మూడు బ్లాక్ స్పాట్ల గుర్తింపు.. ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచన
హనుమకొండ జిల్లా | ఎల్కతుర్తి | Ntoday News
ఎల్కతుర్తి మండల పరిధిలోని NH-563 కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారిని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పరిశీలించారు. ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ గుర్తించిన మూడు బ్లాక్ స్పాట్లను ఆమె రోడ్లు, భవనాల శాఖ, నేషనల్ హైవే, ఆర్టీవో అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ప్రాంతాల్లో రహదారి పరిస్థితులు, ట్రాఫిక్ రాకపోకలు, ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలపై కమిషనర్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రమాదకర ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు, వాహనదారులను అప్రమత్తం చేసే ప్రమాద హెచ్చరిక సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రహదారి భద్రతకు అవసరమైన ఇతర చర్యలపై కూడా అధికారులతో చర్చించారు.
అనంతరం ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన పోలీస్ కమిషనర్ పలు రికార్డులను పరిశీలించి స్టేషన్ పనితీరును సమీక్షించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ కవిత, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) రాయల ప్రభాకర్ రావు, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు, ఆర్టీవో మధుసూదన్ రెడ్డి, నేషనల్ హైవే అధికారులు, సీఐ కొండ్రు శ్రీనివాస్, ఎస్సై నరసింహరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.