శాస్త్ర సంప్రదాయాల ప్రకారమే ధర్మపురి క్షేత్ర పునర్నిర్మాణం
శాస్త్ర సంప్రదాయాల ప్రకారమే ధర్మపురి క్షేత్ర పునర్నిర్మాణం
శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ జీర్ణోద్ధరణకు శృంగేరి పీఠాధిపతుల అనుమతి
ఆలయ ప్రారంభోత్సవానికి జగద్గురువులకు ఆహ్వానం పలికిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గోదావరి పుష్కరాల అనంతరం యోగా నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ
ధర్మపురి/జగిత్యాల:
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ పనులు శాస్త్ర సంప్రదాయాల ప్రకారమే ఉన్నాయని, పనులను వెంటనే ప్రారంభించాలని శృంగేరి పీఠాధిపతి జగద్గురు స్వాములవారు అనుమతినిచ్చారు.
సోమవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో శ్రీనివాస్ మరియు ధర్మపురి అగ్రహార ప్రముఖులతో కూడిన బృందం శృంగేరిలో జగద్గురు స్వాములవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణకు సంబంధించిన నమూనా పత్రాలు, వివరాలను పీఠాధిపతులకు అందజేసి వివరించారు.
రూ. 10 కోట్లతో విస్తరణ పనులు:
ధర్మపురి శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణకు ప్రభుత్వం ఇటీవల రూ. 10 కోట్లు కేటాయించిందని, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకుస్థాపన కూడా నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఆలయ విస్తరణ మరియు పునర్నిర్మాణ పనులను వచ్చే గోదావరి పుష్కరాలలోపు పూర్తి చేయాలని శృంగేరి పీఠాధిపతులు సూచించారు. పనులు పూర్తయిన తర్వాత ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సిందిగా జగద్గురువులను మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించగా, వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా వస్తామని మాట ఇచ్చారు.
పుష్కరాల తర్వాత యోగా నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ:
ధర్మపురిలోని శ్రీ యోగా నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణను కూడా చేపట్టాలని పీఠాధిపతులు సూచించగా, 2027లో జరిగే గోదావరి పుష్కరాలు ముగిసిన వెంటనే ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు చేయించి యోగా నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు కూడా చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మరియు అధికారులకు శృంగేరి జగద్గురువులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేసి ఆశీర్వదించారు. పీఠాధిపతుల అనుమతి లభించడంతో శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.