చదలవాడ రాజా మృతిపై బంధువుల వివరణ
కందుకూరు: కందుకూరు మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన చదలవాడ రాజా మృతి ఘటనపై ఆయన బంధువులు కోటారెడ్డి ఆసుపత్రి వద్ద వివరణ ఇచ్చారు. బంధువులు ఎండ్లూరి సునీల్, అత్యాల జోసెఫ్ మాట్లాడుతూ రాజా అనారోగ్యంతో కోటారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
రాజా ఆరోగ్యం బాగోలేక శుక్రవారం కోటారెడ్డి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినట్లు వారు పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ రాజా మృతి చెందినట్లు వెల్లడించారు.
రాజా మృతి అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు కోటారెడ్డి ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కందుకూరు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఆసుపత్రిలో అందించిన వైద్య చికిత్సను పరిశీలించినట్లు పేర్కొన్నారు.
వైద్య చికిత్సలో ఎలాంటి లోపం లేదని, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగానే రాజా మృతి చెందినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తమకు వివరించారని బంధువులు తెలిపారు. అధికారుల వివరణతో సంతృప్తి చెందిన తాము ధర్నాను విరమించినట్లు వారు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో చదలవాడ రాజా బంధువులు, వెంకటాద్రిపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు.