నివేదికలు సమీక్షలకే పరిమితం కాకూడదు..
నివేదికలు సమీక్షలకే పరిమితం కాకూడదు.. అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు కావాలి
అమరావతి: ప్రభుత్వ శాఖలు రూపొందించే నివేదికలు కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే కార్యాచరణ ప్రణాళికలుగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నెల ఆర్థిక నివేదికపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వివిధ రంగాల పనితీరుపై ఆయన చర్చించారు.
వ్యవసాయ రంగంతో పాటు సేవలు, పరిశ్రమల రంగాల్లోనూ వృద్ధి సాధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా ప్రజల జీవన ప్రమాణాల్లోనూ ప్రతిబింబించాలని స్పష్టం చేశారు. ఆర్థిక రంగంలో సాధించే పురోగతి సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలని పేర్కొన్నారు.
వివిధ శాఖల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, గుర్తించిన సమస్యలకు పరిష్కారాలు చూపాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఉత్పాదకత పెంపు, పరిశ్రమల అభివృద్ధి, సేవల రంగం విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. నివేదికల్లో వెల్లడయ్యే అంశాల ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి, నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు.